మహిళ నుంచి గొడుగు లాక్కున్న పాక్‌ ప్రధాని.. వీడియో వైరల్

పాక్‌ ప్రధాని కారు దిగగానే మహిళా అధికారి గొడుగు పట్టింది. కానీ దాన్ని ఆయన లాక్కున్నారు.

By Srikanth Gundamalla
Published on : 23 Jun 2023 9:13 PM IST

Pakistan, Prime Minister, Umbrella Viral Video

మహిళ నుంచి గొడుగు లాక్కున్న పాక్‌ ప్రధాని.. వీడియో వైరల్

ప్యారిస్ వేదికగా గ్లోబల్ ఫైనాన్సింగ్‌ ప్యాక్ట్‌ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వెళ్లారు. సమావేశానికి పాక్‌ ప్రధాని వెళ్లిన సమయంలో వర్షం పడుతోంది. అదే ఆయనకు తంటాలు తెచ్చిపెట్టింది. షెహబాజ్‌ షరీఫ్‌ కారు దిగగానే వర్షం పడుతుండటంతో గొడుగు పట్టేందుకు సిద్ధంగా ఉంది ఓ మహిళా అధికారి. ఆ గొడుగుని ఆమె నుంచి లాక్కుని వెళ్లారు పాక్‌ ప్రధాని. దీంతో సదురు అధికారిణి వర్షంలోనే నడవాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్యారిస్‌లో సమావేశం జరుగుతోన్న భవనానికి కారులో వచ్చారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్. అప్పటికే వర్షం పడుతోంది. కొందరు మహిళా అధికారులు ఆయనకు స్వాగతం పలికేందుకు వేచి చూస్తున్నారు. వర్షం వల్ల ఇబ్బంది పడకుండా ఉండేందుకు గొడుగు కూడా సిద్ధంగా ఉంచారు. ఆయన కారు దిగగానే మహిళా అధికారి షెహబాజ్‌ షరీఫ్‌కు గొడుగు పట్టింది. ఆయన గొడుగుని ఆమె నుంచి తీసుకునే ప్రయత్నం చేశారు. దాంతో.. ఆ మహిళా మీకు ఇబ్బంది కలగకుండా గొడుగు పైకే పట్టుకుంటానన్నట్లు చెప్పింది. దాంతో షెహబాజ్‌ షరీఫ్‌ గొడుగుని వదిలేశారు. కానీ కొద్ది సెకన్లకే ఏమనుకున్నారో తెలియదు కానీ.. మహిళా అధికారి నుంచి గొడుగుని లాక్కుని గబగబా ముందుకి నడిచారు. దీంతో.. ఆ మహిళ వర్షంలోనే తడవాల్సి వచ్చింది. కనీసం ఆయన దాన్ని పట్టించుకోలేదు కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌ ప్రధానిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించారని.. మహిళా అధికారిణి గురించి పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. అలా మహిళను వర్షంలోనే వదిలేస్తారా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Next Story