ఇమ్రాన్ ఖాన్ నోటి నుండి ఆ వ్యాఖ్యలు.. వారిని శాంతింపజేయడానికేనా..
Pakistan PM says insulting Mohammed should be the same as denying Holocaust. పాకిస్థాన్ లో ఇటీవల తీవ్ర అశాంతి నెలకొన్న సంగతి
By Medi Samrat
పాకిస్థాన్ లో ఇటీవల తీవ్ర అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే..! దీంతో వారిని శాంతిపజేయడానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తే ప్రపంచంలోని ముస్లింలు అస్సలు క్షమించరని.. యూధుల త్యాగాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకున్నట్టే.. మహ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడే వారిపైనా పాశ్చాత్య దేశాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముస్లింలు దైవదూషణను అస్సలు క్షమించరని, మహ్మద్ ప్రవక్తను అవమానిస్తే ఊరుకోబోరని అన్నారు. ముస్లింల గురించి చెడు ప్రచారం చేసే వారిపైనా చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేయాలని పాశ్చాత్య దేశాలను కోరారు. ఇస్లామోఫోబియాతో రెచ్చిపోతున్న విదేశీ తీవ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 కోట్ల మంది ముస్లింలను బాధిస్తున్నారని.. అలాంటి తీవ్రవాదులంతా మహ్మద్ ప్రవక్తను ముస్లింలు ఎంత ప్రేమిస్తారో, ఆరాధిస్తారో తెలుసుకోవాలని హితవు చెప్పారు. ప్రవక్తను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
నిషేధిత ఇస్లామిక్ గ్రూపు- తెహ్రీక్-ఇ-లిబాయక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) నాయకుడు సాద్ రిజ్వీని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడమే కాకుండా.. నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ ఉన్నాయి. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండిల్లో పరిస్థితులను అదుపుచేయలేకపోయారు పోలీసులు. మహమ్మద్ ప్రవక్తపై చార్లీ హెబ్డో సహా కొన్ని ఫ్రెంచి పత్రికల్లో కార్టూన్లను ప్రచురించడంపై సాద్ రిజ్వీ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. గత నెలరోజులుగా టీఎల్‌పీ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసింది. దీంతో పోలీసులు మంగళవారం నాడు రిజ్వీని అరెస్టు చేశారు. రిజ్వీ అరెస్టుపై పలువురు ఆందోళనకారులు రోడ్డునెక్కడంతో వారిని శాంతింపజేయడానికి ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి పాకిస్థాన్ ఫ్రెంచ్ తో సంబంధాలను తెంచుకుంది.