అణ్వాయుధాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నభారత్-పాక్..!
Pakistan India exchange list of nuclear installations.భారత్, పాకిస్తాన్ దేశాలు శనివారం నాడు తమ అణు వ్యవస్థాపనలు
By M.S.R
భారత్, పాకిస్తాన్ దేశాలు శనివారం నాడు తమ అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో దౌత్య మార్గంలో ఏకకాలంలో ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకున్నట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సమాచార మార్పిడి జరిగినట్టు తెలిపింది. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందంపై 1988 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ సంతకం చేశాయి. 1991 జనవరి 27 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పట్నించి 31 ఏళ్లుగా ఏటా జనవరి 1న ఇరుదేశాలు ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇరు దేశాల జైళ్లలో ఉన్న ఖైదీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రెండు దేశాలు షేర్ చేసుకున్నాయి. పౌరులు, రక్షణ సిబ్బంది, మత్స్యకారులతో సహా ఆయా జైళ్లలో ఉన్న ఖైదీల జాబితాలను ఇరు దేశాలు పరస్పరం మార్చుకున్నాయి.
కాశ్మీర్ సమస్యతో పాటు సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించి ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతల మధ్య ఈ జాబితాల మార్పిడి జరిగింది. 51 మంది పౌరులు మరియు 577 మంది మత్స్యకారులతో సహా 628 మంది భారతీయ ఖైదీల జాబితాను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌తో పాకిస్తాన్ పంచుకుంది. 282 మంది పౌరులు మరియు 73 మంది మత్స్యకారులతో సహా భారతదేశంలోని 355 మంది పాకిస్తానీ ఖైదీల జాబితాను భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌తో ఏకకాలంలో పంచుకుంది.