డబ్బులు లేవు.. అధికారిక నివాసాన్ని అద్దెకు ఇస్తున్న ఇమ్రాన్
Pakistan Govt puts PM Imran Khans official home up for rent.పాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోతోంది. ఖర్చులకు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 10:38 AM GMTపాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోతోంది. ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. దీంతో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో ప్రధాన మంత్రి భవనాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని యూనివర్సిటీ మరియు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని గతంలో చెప్పిన ఇమ్రాన్ ఖాన్ మాట తప్పుతూ.. ఇప్పుడు ఫ్యాషన్, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల కోసం దానిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ క్యాబినెట్ కూడా ఖరారు చేసింది. ఆగష్టు 2019 లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి అధికారిక గృహాన్ని ఖాళీ చేసి, బని గాలాలోని తన ఖరీదైన నివాసానికి మారారు. ఇప్పటికే సెప్టెంబర్ 2018 లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి నివాసంలో ఉంచిన గేదెలను వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. పశువుల అమ్మకం వలన 23.02 లక్షల పాకిస్తాన్ రూపాయలు వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని పిఎం హౌస్‌కు చెందిన 61 లగ్జరీ కార్లను కూడా వేలం వేశారు. ప్రభుత్వ నిధులకు 20 కోట్లు కూడా వచ్చాయి.
ఆగష్టు 2019 లో బ్రిగేడియర్ వసీం ఇఫ్తీకార్ చీమా కుమార్తె అనం వసీమ్ వివాహ వేడుక కోసం పిఎం హౌస్‌ను అద్దెకు ఇచ్చారు. ఆ సమయంలో చీమా పాకిస్తాన్ ప్రధానికి సైనిక కార్యదర్శిగా ఉన్నారు. ఒకప్పుడు యూనివర్సిటీగా చేస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ మాట మార్చి పిఎం హౌస్‌ను అద్దెకు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నిధులను జోడించాలని నిర్ణయించుకున్నాడు. గవర్నర్ల బంగాళాలను కూడా ఇదే విధంగా ఆదాయం వచ్చేందుకు ప్రణాళికలను రూపొందించింది పాక్ ప్రభుత్వం.