పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో చుక్కెదురైంది.

By Srikanth Gundamalla  Published on  30 Jan 2024 3:00 PM IST
pakistan, ex prime minister, imran khan, sentenced,  10 years,  prison,

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష 

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో చుక్కెదురైంది. ఇమ్రాన్‌ఖాన్‌కు సైఫర్ కేసులో న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్‌తో పాటు ఆయన సన్నిహితుడు పీటీఐ వైస్‌ చైర్మన్ షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు పాకిస్థాన్‌ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ రహస్యాలను లీక్‌ చేసిన కేసు (సైఫర్‌)లో న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెల్లడించింది.

సైఫర్ కేసు దౌత్యపరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను ఇమ్రాన్‌ఖాన్‌ బహిర్గతం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపత్యంలోనే అధికారిక రహస్యాల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదే కేసు ద్వారా తనని ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందనీ అప్పట్లో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. కానీ.. ఏప్రిల్ 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం ఓడిపోయింది. దాంతో.. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగారు.

పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌కు తోషాఖానా కేసులో ట్రయల్‌ కోర్టు శిక్ష విధించింది. మూడేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఈ శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. కానీ.. ఇతర కేసుల నేపథ్యంలో నిర్బంధంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి సైఫర్‌ కేసుపై వాదనలు జరిగాయి. తాజాగా కోర్టు ఈ సైఫర్ కేసులో తుది తీర్పు వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా.. ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.

Next Story