2019లో అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్న పాక్ అధికారి తాలిబన్ల ఘర్షణలో మృతి
పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) ఉగ్రవాదుల దాడిలో మరణించారు.
By Knakam Karthik
2019లో అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్న పాక్ అధికారి తాలిబన్ల ఘర్షణలో మృతి
భారత వైమానిక దళ పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను 2019లో పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకున్న ఘటనలో కీలక వ్యక్తి పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (37) ఉగ్రవాదుల దాడిలో మరణించారు.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో బుధవారం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులతో జరిగిన తీవ్రస్థాయి ఘర్షణలో మేజర్ అబ్బాస్ షా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 2019లో భారత పైలట్ అభినందన్ వర్థమాన్ పట్టుబడటంలో పాల్గొన్న పాకిస్తానీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మరణించిన ఇద్దరు సిబ్బందిలో ఒకరు.
పాకిస్థాన్ సైన్యంలోని ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ)లో అబ్బాస్ షా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా ఆయన బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా టీటీపీ ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పాక్ సైనిక వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ భీకర పోరులో మేజర్ అబ్బాస్ షాతో పాటు లాన్స్ నాయక్ జిబ్రానుల్లా అనే మరో సైనికుడు కూడా వీరమరణం పొందారని, భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాక్ సైన్యం వెల్లడించింది.
కాగా, 2019 ఫిబ్రవరి 27న బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత రోజు, భారత గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన మిగ్-21 బైసన్ విమానంతో వీరోచితంగా వెంటాడి కూల్చివేశారు. ఈ పోరాటంలో అభినందన్ విమానం కూడా దెబ్బతిని నియంత్రణ రేఖకు ఆవల పాకిస్థాన్ భూభాగంలో కుప్పకూలింది. దీంతో పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందకు దిగిన ఆయన్ను పాకిస్థాన్ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అభినందన్‌ను బంధించిన సైనిక బృందంలో మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కూడా ఉన్నారని, ఆయనను చిత్రహింసలు పెట్టడంలోనూ అబ్బాస్ షా పాత్ర ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.