మొజాంబిక్‌లోని ఉత్తర తీరంలో రద్దీగా ఉండే తాత్కాలిక ఫెర్రీ మునిగిపోవడంతో 90 మందికి పైగా మరణించారని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. దాదాపు 130 మందితో కూడిన ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషాద ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. "బోటు రద్దీగా ఉండటం, ప్రయాణీకులను తీసుకెళ్లడానికి అనువుగా లేకపోవడంతో అది మునిగిపోయింది.. 91 మంది ప్రాణాలు కోల్పోయారు" అని నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో చెప్పారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని ఆయన తెలిపారు. సహాయక సిబ్బంది ఐదుగురి ప్రాణాలు కాపాడారు.
మరింత మంది కోసం వెతుకుతున్నారు, అయితే సముద్ర పరిస్థితులు ఆపరేషన్ కష్టతరం చేస్తున్నాయి. చాలా మంది ప్రయాణికులు కలరా గురించి తప్పుడు సమాచారం కారణంగా భయాందోళనలకు గురవుతున్నందున ప్రధాన భూభాగం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నెటో చెప్పారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని అత్యంత పేదలలో ఒకటైన దక్షిణాఫ్రికా దేశం, అక్టోబర్ నుండి దాదాపు 15,000 నీటి ద్వారా వచ్చే వ్యాధి కేసులు, 32 మరణాలను నమోదు చేసింది. నంపులా అత్యంత ప్రభావితమైన ప్రాంతం, ఇది మొత్తం కేసులలో మూడవ వంతు. పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు బృందం పనిచేస్తోందని అధికారి తెలిపారు.