నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 600 మందికిపైగా మృత్యువాత

Over 600 people dead, 1.3 million displaced as flood ravages Nigeria. ఆఫ్రికా దేశం నైజీరియాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో

By అంజి  Published on  18 Oct 2022 10:20 AM IST
నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 600 మందికిపైగా మృత్యువాత

ఆఫ్రికా దేశం నైజీరియాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో నైజీరియా దేశం పూర్తిగా నీటిమయం అయిపోయింది. గత 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం భారీ వరదల కారణంగా 600 మందికిపైగా మృతి చెందారు. వరదల ధాటికి ఇళ్లులు కొట్టుకుపోవడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయితే ముందస్తుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కానీ ప్రజలు అప్పటికీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం కాలేదు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని అధికారులంటున్నారు. నైజీరియా మానవతా వ్యవహారాలు, విపత్తు నిర్వహణ మంత్రి సదియా ఉమర్ ఫరూక్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ భారీ విపత్తులో ఇప్పటివరకు దాదాపు 2లక్షల ఇళ్లు కొట్టుకుపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా నవంబర్‌ చివరి వరకు కూడా అక్కడ వర్షాలు, వరదలు కొనసాగే అవకాశం ఉంది.

ఈ వర్షబీభత్సం నైజీరియాలోని 36 రాష్ట్రాల్లోని 33 రాష్ట్రాల ప్రజలను ప్రభావితం చేసిందని ఉమర్‌ ఫరూక్ పేర్కొన్నారు. లక్షలాది మందికి సహాయక సామగ్రిని తరలించడానికి స్థానిక అధికారులు శ్రమిస్తున్నారు. వరద బాధితుల కోసం గత వారం అధ్యక్షుడు బుహారీ 12,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆమోదించారని మానవతా వ్యవహారాల మంత్రి తెలిపారు. నవంబర్ చివరి వరకు ఐదు రాష్ట్రాలు ఇంకా వరదలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని అన్నారు. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం "వరద బాధితులందరినీ సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేయాలని" ఆదేశించారు.

దేశంలో విపరీతమైన వరదలకు భారీ వర్షాలు, వాతావరణ మార్పులే కారణమని చెబుతున్నారు. భారీ వర్షాల వల్ల ఇళ్లు కాకుండా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కూడా ధ్వంసమయ్యాయి.

Next Story