సైన్యం మారణహోమం.. 30 మందికిపైగా కాల్చివేత.. మృతుల్లో మహిళలు, చిన్నారులు
Over 30 Women and children killed in Myanmar.మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని
By తోట వంశీ కుమార్
మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జుంటా నాయకత్వంలోని సైన్యం ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి అక్కడ మారణహోమం కొనసాగుతోంది. సైన్యం పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలపై ఉక్కుపాదాన్ని మోపుతోంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో కొంత సైలెంట్‌గా ఉన్న సైన్యం.. మరో అకృత్యానికి పాల్పడింది.
శరణార్థుల శిబిరాలకు వెలుతున్న మహిళలు, చిన్నారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటన కయాహో రాష్ట్రంలోని మోసో గ్రామంలో చోటు చేసుకుంది. దాదాపు 30 మందికిపైగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మోసో గ్రామం పక్కనే ఉన్న కియోగాస్ గ్రామ సమీపంలో శుక్రవారం సాయుధ ప్రతిఘటన బలగాలకు, మయన్మార్ సైన్యానికి మధ్య పోరాటం జరిగింది. ఈ సమయంలో శరణార్ధులు శిబిరాలకు వెలుతుండగా.. సైనం వారిని పట్టుకుని కాల్చి చంపింది.
అనంతరం వారి మృతదేహాలను తాళ్లతో కట్టేసి వాహనాల్లో పడేసి నిప్పుపెట్టారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కనీసం వారి మృతదేహాలను గుర్తించేందుకు వీలు లేకుండా పోయిందని వాపోయారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై మయన్మార్ సైన్యం కథనం మరోలా ఉంది. ప్రతిఘటన బలగాలకు చెందిన వారు ఆయుధాలతో ఏడు వాహనాల్లో ఉన్నారని.. వారిని ఆగమని హెచ్చరించినా ఆగకపోవడంతోనే కాల్పులు జరిపామని తెలిపింది.
కాగా.. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హక్కులను ఉల్లంఘించే అమానవీయ, క్రూరమైన ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు కంటతడిని పెట్టిస్తున్నాయి.