శ్రీలంకలో ఇటీవల ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే జులై 9న అధ్యక్ష భవనం, టెంపుల్ ట్రీస్‌లోని ప్రధానమంత్రి అధికారిక వ్యక్తిగత నివాసాల్లోకి నిరసనకారులు చొచ్చుకు వచ్చారు. లక్షల సంఖ్యలో నిరసనకారులు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతోపాటు మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేనివాసాల్లోకి దూసుకెళ్లారు. అనంతరం అక్కడే కొన్ని రోజులు తిష్ఠ వేశారు. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 1000కిపైగా విలువైన కళాఖండాలు మాయమయ్యాయి. ఈ విషయాన్ని లంక పోలీసులు వెల్లడించారు. ఇందులో అత్యంత పురాతన, అరుదైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని అధికారిక నివాసం నుంచి అరుదైన కళాఖండాలతో సహా కనీసం 1,000 విలువైన వస్తువులు మాయమైనట్లు పోలీసులు చెప్పినట్టు వెబ్ పోర్టల్ కొలంబో పేజ్ పేర్కొంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధ్యక్ష భవనం పురావస్తు ప్రాముఖ్యమైన ప్రదేశంగా గెజిట్ చేయబడినప్పటికీ.. అందులో ఉన్న పురాతన వస్తువులు, విభిన్న కళాఖండాల గురించి శ్రీలంక పురావస్తు శాఖ వద్ద వివరణాత్మక రికార్డు లేదని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
నిరసనకారులు శాంతియుతంగా తమ ప్రదర్శనలను చేపట్టే హక్కులను తాను గౌరవిస్తానని, అయితే రాష్ట్రపతి భవనం లేదా ప్రధానమంత్రి వ్యక్తిగత నివాసం వంటి మరో ప్రభుత్వ భవనాన్ని ఆక్రమించడాన్ని తాను అనుమతించబోనని కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రణిల్ విక్రమసింఘే తెలిపారు. ప్రజలు ప్రజా సౌకర్యాలను ముట్టడించడం, పార్లమెంట్‌ను అడ్డుకోవడం వంటి చర్యలను ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను శ్రీలంక సాయుధ దళాలకు, పోలీసులకు అధికారం ఇచ్చానని విక్రమసింఘే చెప్పారు.