తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. దీంతో ఆదేశంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై అక్కడి సైన్యం స్పందించింది. ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా తెలిపారు. అయితే..ఇందుకు ప్రజల మద్దతు అవసరం అని చెప్పారు. శాంతి, భద్రతల పరిరక్షణ కోసం దేశ ప్రజలు సహకరించాలని ఆదివారం ఆయన కోరారు.
నిన్న వేలాది మంది అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో జూలై 13న పదవి నుంచి తప్పుకుంటానని అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రకటించగా.. ఇప్పటికే రణిల్ విక్రమ సింఘే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తానని విక్రమ సింఘే ముందే చెప్పినప్పటికి ఆందోళనకారులు ఆయన ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో చివరికి లంకలో అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆందోళనలు ఉదృతం అవుతాయని ముందే పసిగట్టిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స శుక్రవారం రాత్రే తన నివాసం నుంచి పరారు అయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారు అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో రక్షణ దళాల చీఫ్ జనరల్ శవేంద్ర శిల్ప ప్రకటన చేశారు. శాంతియుత మార్గంలో సంక్షోభ పరిష్కారానికి అవకాశం లభించినట్లు తెలిపారు. దేశంలో శాంతి స్థాపనకు వీలుగా సాయుధ దళాలు, పోలీసులకు సహకారం అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.