ఉల్లిగ‌డ్డ‌తో కొత్త వ్యాధి.. భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు

Onions linked to salmonella outbreak in 37 states.ఉల్లి పేరు వింటేనే అగ్ర‌రాజ్యం అమెరికా వ‌ణికిపోతుంది. ఉల్లిగ‌డ్డ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 3:59 AM GMT
ఉల్లిగ‌డ్డ‌తో కొత్త వ్యాధి.. భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు

ఉల్లి పేరు వింటేనే అగ్ర‌రాజ్యం అమెరికా వ‌ణికిపోతుంది. ఉల్లిగ‌డ్డ‌ల ద్వారా మ‌రో కొత్త వ్యాధి సోకుతుండ‌డ‌మే అందుకు కార‌ణం. వంట‌గ‌దిలో ఉండే ఉల్లిగ‌డ్డ‌ల ద్వారా సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. అమెరికా దేశంలోని చాలా రాష్ట్రాల్లో సాల్మొనెల్లోసిస్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అక్టోబ‌ర్ 18 వ తేదీ వ‌ర‌కు 37 రాష్ట్రాల్లో 652 మందికి ఈ వ్యాధి సోకింద‌ని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలిపింది. ఇందులో 129 మంది ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. టెక్సాస్‌లో అత్యధికంగా 158 కేసులు, ఓక్లాహోమాలో 98, వర్జీనియాలో 59, ఇల్లినాయిస్‌లో 37 కేసులు న‌మోదు అయ్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన కేసుల క‌న్నా ఇంకా ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంద‌ని సీడీసీ అభిప్రాయ‌ప‌డింది. ఈ వ్యాధి ముదిరి మ‌హ‌మ్మారిగా మారే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ వ్యాధికి కార‌ణం ఉల్లిగ‌డ్డ‌నే అనే నిర్థార‌ణ‌కు అధికారులు వ‌చ్చారు. మూడు నెల‌ల పాటు నిల్వ చేసిన ఉల్లిపాయ‌ల‌ను వాడొద్ద‌ని వినియోగదారుల‌కు సీడీసీ సూచించింది. ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో స‌రిగ్గా తెలియ‌క‌పోయినా, మెక్సికో నుంచి వచ్చినవైనా, ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా, ప్రోసోర్స్ సంస్థ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా స‌రే వెంట‌నే వాటిని బ‌య‌ట ప‌డేయాల‌ని సూచించింది. జులై 1 నుంచి ఆగ‌స్టు 27 వ‌ర‌కు దిగుమ‌తి చేసుకున్న ఉల్లిపాయ‌ల‌ను వెన‌క్కు తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చిన‌ట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) తెలిపింది. ఈ ర‌కాలైన ఉల్లిని క‌లిగిఉంటే ఆయా ఉప‌రిత‌లాల‌ను శుభ్రం చేసి శానిటైజ్ చేయాల‌ని కోరింది.

సాల్మొనెల్లా వ్యాధి లక్షణలు..

ఈ బాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు తిన్నవారికి 6 గంట‌ల నుంచి 6 రోజుల్లో ఈ వ్యాధి సోకుతుంది. జ్వరం, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయ‌ని వైద్యులు చెప్పారు. ఈ ల‌క్ష‌ణాలు ఉండే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సీడీసీ సూచించింది. ఇది మ‌రీ ప్రాణాంత‌క వ్యాధి కాద‌ని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువ‌గా తాగ‌డం ద్వారా ఈ వ్యాధిని నివారించ‌వ‌చ్చున‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story