ఘోర ప్రమాదం.. విరిగిపడ్డ కొండచరియలు..100 మంది కూలీల గల్లంతు
One dead and dozens missing after landslide at Myanmar jade mine.మయన్మార్ దేశంలోని గనుల ప్రాంతాల్లో కొండచరియలు
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 1:32 PM ISTమయన్మార్ దేశంలోని గనుల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ప్రజల ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. కచిన్ రాష్ట్రంలో మొత్తం 300 గనులు ఉండగా ఎప్పుడూ ఏదో గని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున మయన్మార్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మయన్మార్‌లోని కచిన్ రాష్ట్రం జడే మైన్ వద్ద ఉదయం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ గనుల్లో పని చేస్తున్న మరో 70 నుంచి 100 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు, రెస్య్కూ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గల్లంతైన వారి కోసం 200 మంది సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. సమీపంలోని సరస్సులో బోట్ల సాయంతో వెతుకున్నారు.
కచిన్ ప్రావిన్స్‌లో జేడ్ (ఒక రకమైన రంగురాళ్లు) గనులు ఎక్కువగా ఉంటాయి. వాటికి చైనాలో భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో గనుల నుంచి కూలీల సాయంతో రంగురాళ్లను సేకరిస్తుంటారు వ్యాపారులు. అయితే.. వారికి తక్కువ మొత్తాన్ని చెల్లించి ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. గనుల్లో పనిచేస్తే తక్కువ మొత్తమే వస్తున్నప్పటికీ వేరే ఆధారం లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలకు తెగించి గనుల్లోపలికి వెళ్లి రంగురాళ్లను సేకరిస్తుంటారు.
గనుల్లోకి వెళ్లేటప్పుడు వీరికి ఎలాంటి రక్షణ చర్యలు కల్పించరు. ఫలితంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు కొండ చరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం ఇక్కడ సర్వసాధారం. తాజాగా జరిగిన ఘటనలోనూ 100 మందికి పైగా గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.