రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించింది. రూపాలు మార్చుకుంటూ వేవ్‌ల రూపంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. మొన్నటి వరకు తమ దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేవని చెబుతూ వచ్చింది ఉత్తర కొరియా. అయితే.. వైరస్ వెలుగు చూసిన మరుసటి రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
కాగా.. వీరంతా జ్వరంతో మరణించినట్లు చెప్పుకొచ్చింది. వీరిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. తాజాగా మరో 21 మంది జ్వరానికి బలయ్యారు. అయితే.. వీరంతా కరోనాతో మరణించారా..? లేదా అన్నది ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఉత్తరకొరియా దేశంలో జ్వర పీడితుల సంఖ్య 2,80,810కి చేరింది. వీరందరిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా..ఇవన్ని కరోనా కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. తాజాగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో ఉత్తర కొరియా దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతోపాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సిన్లను అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ, రష్యా, చైనా ప్రకటించాయి. అయితే ఇందుకు ఆదేశ అధ్యక్షుడు కిమ్ ఒప్పుకోలేదు.