ఉత్తరకొరియాలో కరోనా విలయతాండవం.. మూడు రోజుల్లోనే 8 లక్షల కేసులు
North Korea reports 15 more 'fever' deaths amid Covid outbreak.కిమ్ రాజ్యంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది.
By తోట వంశీ కుమార్
కిమ్ రాజ్యంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దాదాపు రెండేళ్లుగా తమ దేశంలో కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పుకుంటూ వస్తున్న ఉత్తరకొరియా దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. క్వారంటైన్, కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేసినా.. కరోనా ఆ దేశంలోకి ఎంటర్ అయిన మూడు రోజుల్లోనే లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. శనివారం మరో 15 మంది ఈ మహమ్మారికి బలైనట్లు ఆదేశ అధికారిక మీడియా 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ' తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 42కి చేరింది.
కొత్తగా 2,96,180 మందిలో వైరస్ లక్షణాలతో కూడిన జ్వరాలను గుర్తించినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,20,620 కి చేరింది. మూడు రోజుల్లోనే కేసులు ఈ స్థాయిలో పెరగడం కలవరపరుస్తోంది. ఉత్తరకొరియా దేశంలో దశాబ్దాలుగా ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. కరోనా మహమ్మారి తమ దేశంలోకి రాకుండా ఉండేందుకు విదేశాలతో ఆ దేశం పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. దీంతో అక్కడ వైరస్‌ను గుర్తించడానికి కనీస కిట్లు లేవని తెలుస్తోంది.
ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు, కౌంటీల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని ఆ దేశ అధికారిక పత్రిక కేసీఎన్ఏ వెల్లడించింది. పని ప్రాంతాలు, ఉత్పత్తి యూనిట్లు, నివాస సముదాయాలన్నింటినీ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా మూసేసినట్టు పేర్కొంది. ఇక దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తల్నిరంగంలోకి దింపినట్లు తెలిపింది. వీరంతా ప్రజల్లో లక్షణాలు గుర్తించడంతో పాటు వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది.