ఓ పక్క ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోయిన వేళ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రెండేళ్ల కాలంలో దాదాపుగా ప్రతీ దేశంలో కరోనా కేసులు వెలుగుచూసినా తమ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆ దేశం ఇప్పటి వరకు చెప్పుకురాగా.. తాజాగా తొలి కేసు వెలుగు చూసింది. దీంతో ఉత్తరకొరియా వెంటనే అప్రమత్తమైంది. సరిహద్దులను మూసివేయడంతో పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించారు.
ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను వైద్యులు పరీక్షించగా.. వారిలో ఒకరికి కరోనా వేరియంట్ ఒమిక్రాన్ సోకిందని నిర్థారణ అయినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీంతో వైరస్ వ్యాప్తిచెందకుండా అధ్యక్షుడు కిమ్ దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా.. వైరస్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమైన సమాచారం లేదు. కాగా.. దాదాపు రెండున్నర కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటి వరకు టీకాలు అందలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఉత్తరకొరియా చుట్టు పక్క దేశాలు కరోనా విజృంభణతో ఇబ్బంది పడుతున్నాయి. చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ దశల వారిగా విజృంభిస్తోంది. ఇటీవల ఆర్థిక రాజధాని షాంఘై సహా పలు నగరాలు కరోనా విజృంభన, ఆంక్షలతో ఎంతగానే ఇబ్బంది పడుతున్నారు.