ఉత్తరకొరియాలో తొలి కరోనా మరణం.. మొదటిసారి ముఖానికి మాస్క్‌తో కిమ్
North Korea announces first death from Covid-19.ఉత్తరకొరియా దేశంలో ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి పెద్దగా
By తోట వంశీ కుమార్ Published on 13 May 2022 1:30 PM ISTఉత్తరకొరియా దేశంలో ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ పాలనే అందుకు కారణం. ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికించిన సమయంలో ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆదేశం వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ మహమ్మారి ధాటికి బలై పోయినా.. తమ దేశంలో మాత్రం కరోనా కేసులు వెలుగుచూడలేదని కిమ్ ప్రభుత్వం గొప్పలకు పోయింది.
అయితే.. ఎట్టకేలకు కిమ్ రాజ్యంలో కూడా కరోనా అడుగుపెట్టినట్లు ఆ దేశం ఒప్పుకుంది. తొలి కరోనా కేసు నమోదు అయిన కొన్ని గంటల్లోనే ఆ దేశంలో కరోనాతో తొలి మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని.. అందులో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్ బీఏ 2 వేరియంట్‌ను గుర్తించినట్లు చెప్పింది.
ప్రస్తుతం ఉత్తర కొరియాలో 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే.. వీరికి కరోనా సోకిందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇక దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు కిమ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్ విధించారు. అధికారులతో సమీక్షలో తొలిసారి కిమ్ తన ముఖానికి మాస్క్ పెట్టుకుని కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తరకొరియాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఆ దేశానికి టీకాలు అందిస్తామని పలు దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినా.. ఆ టీకాలు తీసుకునేందుకు కిమ్ నిరాకరించారు. దీంతో ఆ దేశంలో కరోనా టీకాలు అందుబాటులోకి రాలేదు. మరీ ఇప్పటికైనా కిమ్.. కరోనా టీకాలను అనుమతిస్తాడో లేదో మరీ.