అమెరికాలో జనజీవితం మళ్లీ సాధారణ స్థితికి రానుంది. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ఆదేశ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకటించింది. రెండు డోసులు టీకా తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని చెప్పింది. ఇండోర్, అవుట్ డోర్ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో మాస్కులు లేకుండానే పాల్గొనవచ్చునని తెలిపింది.
అయితే.. బస్సులు, విమానాలు, రైళ్లు వంటి ప్రజా రవాణా సాధనాల్లో మాస్కులు ధరించాలని మాత్రం పేర్కొంది. మాస్క్ నిబంధనల సడలింపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్య్తం చేశారు. ఇది గొప్ప రోజు అని అభివర్ణించారు. చాలా మంది అమెరికన్లకు వ్యాక్సిన్‌ను వేగంగా వేయడంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు.
కరోనా ఆంక్షలు సడలించాలని అధ్యక్షుడు జోబైడెన్ సీడీసీని కోరారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్న వారి పట్ల కొవిడ్ ఆంక్షలు సడలించాలని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి నేపథ్యంలో సీడీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజలను కొవిడ్ పరిస్థితుల నుంచి తిరిగి సాధారణ జీవనానికి తీసుకెళ్లేందుకు సీడీసీ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.