కరోనా వైరస్ చైనాలోకి వూహాన్ ల్యాబ్ లో తయారు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వూహాన్ ల్యాబ్ లో కరోనా పుట్టిందా.. లేదా అనే విషయాన్ని తెలుసుకోడానికి డబ్ల్యూహెచ్ఓ ఒక టీమ్ ను చైనాకు పంపింది. పలు విషయాలను ఆ బృందం పరిశీలించింది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, ఇది జంతువుల నుంచి మనుషులకు పాకిన వైరస్ మాత్రమేనని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. అయితే అది ఏ జంతువన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తెలిపారు.
చైనాలోని వూహాన్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ హెడ్ పీటర్ బెన్ ఎంబారెక్, స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి బయట పడలేదని.. కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు సౌత్ ఈస్ట్ ఆసియాపై దృష్టిని సారించామని.. తమ టీమ్ చైనాలో జరుపుతున్న విచారణ దాదాపుగా పూర్తయిందని పీటర్ బెన్ వెల్లడించారు. 2019లో హుబేయి ప్రావిన్స్ లోని వూహాన్ లో తొలిసారిగా కరోనా వైరస్ కనిపించిందనే ప్రచారం సాగింది. ఈ వైరస్ మానవులకు సంక్రమించే ముందు జంతువుల్లో వ్యాపించిందని స్పష్టం చేశారు పీటర్ బెన్. ఇది సహజ సిద్ధంగానే కొన్ని రకాల వైరస్ ల రూపాంతరమేనని అన్నారు.