భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణీలకులపై తాత్కాలిక నిషేదం విధించింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు భారత్ ప్రయాణికులపై నిషేధం అమల్లో ఉండనున్నట్లు న్యూజిలాండ్ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్ పేర్కొన్నారు. భారత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. భారత్ ప్రయాణికులు కాకుండా, భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ దేశస్తులపై కూడా ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్‌లో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు. గురువారం ఒక్కరోజే న్యూజిలాండ్‌కు వెళ్లిన వారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ 23 మందిలో 17 మంది భారతీయులే కావడం గమనార్హం. దీంతో.. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఇక భారత్‌లో గడిచిన 24గంటల్లో 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 685 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్‌లో 9,10,319 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.