కివీస్ ప్రధాని సంచలన నిర్ణయం.. ఫిబ్రవరిలో రాజీనామా
New Zealand PM Jacinda Ardern announces resignation.న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన
By తోట వంశీ కుమార్
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మొదటి వారంలో(ఫిబ్రవరి 7న) ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం అధికార లేబర్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. రాజీనామాకు ఇదే తగిన సమయమని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించింది.
నేను మనిషిని. మనం చేయగలిగినంత కాలం చేస్తాం. ఇవ్వగలిగినంత ఇస్తాము. తరువాత సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం. నేను వెళ్లిపోతున్నా. ఒక దేశానికి నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయం. అయితే.. ఇది అత్యంత సవాలుతో కూడుకున్న పని. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. అని జెసిండా అంది.
ఇక తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదు అని చెప్పింది. రానున్న ఎన్నికల్లో గెలవమని బావించడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో మనం(లేబర్ పార్టీ) తప్పకుండా గెలుస్తాం అని నమ్ముతున్నా అని తెలిపింది. ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటికి ఎంపీగా కొనసాగుతానని చెప్పింది.
సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ 14న జరుగుతాయి. అప్పటి వరకు కొత్త ప్రధాని ఎవరు అనే విషయం ఈ నెల 22న తెలియనుంది. ఆ రోజున లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకోనున్నారు.
జూలై 26, 1980 హామిల్టన్‌లో జెసిండా ఆర్డెర్న్ జన్మించింది. 2008లో ప్రజాప్రతినిధుల సభకు ఎంపీగా ఎన్నికైంది. 2017లో తొలి సారిగా న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. అప్పట్లో ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. అనంతరం 2020లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని విజయతీరాలకు నడిపించారు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఆమె వ్యక్తిగత ప్రజాదరణ కోల్పోయినట్లు తెలిసింది.