గాబ్రియెల్ తుఫాను న్యూజిలాండ్‌ను వణికిస్తోంది. ఉత్తర ద్వీపంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో కివీస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించింది.
నార్త్ ఐలాండ్‌ను ఉష్ణమండల తుఫాను తాకడంతో మంగళవారం ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. వర్షాలు, ఈదురుగాలల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పదివేల కుటుంబాల్లో అంధకాలం నెలకొంది. దీంతో అత్యవసర నిర్వహణ మంత్రి కీరన్ మెక్ అనుల్టీ డిక్టరేషన్‌పై సంతకం పెట్టారు. నార్త్ ఐలాండ్ ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉందన్నారు.
న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించడం ఇది మూడో సారి. 2019లో క్రైస్ట్‌చర్చ్‌లో ఉగ్ర దాడులు, 2020లో కరోనా మహమ్మారి కారణంగా అత్యవసర పరిస్థితిని విధించగా తాజాగా గాబ్రియోల్ తుఫాన్ కారణంగా ఎమర్జెన్సీ విధించారు.
నార్త్ ఐలాండ్, ఆక్లాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈదుల గాలల కారణంగా భారీ వృక్షాలతో పాటు విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. వర్షం, గాలులు ఎమర్జెన్సీ సేవలకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వరదల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది.