నిజమే.. ఆ గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు
New York Governor Cuomo sexually harassed 11 women.న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమోపై లైంగిక వేధింపుల
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 6:45 PM ISTన్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమోపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు వాస్తమేనని అటార్నీ జనరల్ లిటిషియా జేమ్స్ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుత, మాజీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించాడని విచారణలో తేలిందని లిటిషియా జేమ్స్ చెప్పారు. ఐదు నెలల పాటు సాగిన దర్యాప్తులో ఇద్దరు న్యాయవాదులు 179 మందిని విచారించారు. క్యుమో పరిపాలనలో భయానక, బెదిరింపులతో కూడిన పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ఉండేదని విచారణాధికారులు తెలుసుకున్నారు. ఈ విచారణలో గవర్నర్‌తో క్రమం తప్పకుండా సంభాషించే ఉద్యోగులు, రాష్ట్ర భద్రతా బలగాలు, ఎగ్జిక్యూటివ్ చాంబర్స్ ప్రస్తుత, మాజీ సభ్యులు, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రస్తుత, గత ప్రభుత్వ ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని చెప్పారు.
ఆండ్రూ క్యుమో మహిళల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడని స్వతంత్ర దర్యాప్తులో వెల్లడవడంతో ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నివేదికలో 11 మంది మహిళలపై ఆయనతో పాటు ఆయన సీనియర్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడినట్టు స్పష్టమైందని రాసుకొచ్చారు. ఐదు నెలల పాటు జరిగిన ఈ విచారణలో గవర్నర్ ఆండ్రూ క్యుమో జాతీయ, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘిస్తూ పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని తేలింది. న్యూయార్క్ స్టేట్ ఉద్యోగినులను అభ్యంతరకరంగా తాకడం, ద్వందార్ధ వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డాడని విచారణలో స్పష్టమైంది.
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించివ క్యుమోపై తక్షణమే చర్యలు చేపట్టాలని రిపబ్లికన్ సభ్యురాలు ఎలిస్ స్టెఫానిక్ డిమాండ్ చేశారు. గవర్నర్ క్యుమో తన పదవికి రాజీనామా చేయాలని ఆయనను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆమె ట్వీట్ చేశారు. తన వేధింపులను బయటపెట్టారనే ఆగ్రహంతో ఆండ్రూ క్యమో ఆయన సీనియర్ సిబ్బంది అటార్నీ జనరల్ లిటిషియా జేమ్స్ పై కూడా ప్రతీకార చర్యలకు పాల్పడ్డారని దర్యాప్తులో బయటపడింది.