న్యూయార్‌లోని బ్రూక్లిన్ సబ్‌వేలో కాల్పులు.. అనుమానితుడి ఫోటో విడుదల
New York City subway shooting Police identify Frank R.James as person of interest.అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలోని
By తోట వంశీ కుమార్
అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ సబ్‌వే రైల్వే స్టేషన్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్ అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడి ఫోటోను విడుదల చేశారు. అతడిని పట్టిస్తే రివార్డు ఇస్తామని చెబుతున్నారు. ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ను పట్టించిన వారికి 50 వేల డాలర్లు ఇస్తామని న్యూయార్క్ పోలీస్ కమిషనర్ కీచాంట్ సెవెల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాల్పుల ఘటనలో 10 మంది గాయపడ్డారన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మరో 13 మందికి గాయాలు అయ్యాయని చెప్పారు.
రద్దీగా ఉన్న బ్రూక్లిన్ సబ్‌వే రైల్వే స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8గంటల 30 నిమిషాల సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులు జరిపాడు. భవన నిర్మాణ కార్మికుడి దుస్తుల్లో గ్యాస్ మాస్క్ పెట్టుకుని వచ్చిన అతడు ప్రయాణీకులపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన ఆర్ లైన్ ట్రైన్‌లోకి స్మోక్ బాంబ్ విసిరి కాల్పులు జరిపాడని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. భయాందోళనలు చెందిన ప్రయాణీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. మొత్తంగా 23 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సబ్ వేలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. అమెరికాలో గన్ కల్చర్ కంట్రోల్‌పై కొత్త నిబంధనలు ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.