కరోనా వైరస్.. చెనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచంలోని ప్రతి మూలకు చేరింది. ఆయా దేశాల వాతావరణ పరిస్థితులను బట్టి రూపాంతరం చెందుతూ మరింత వేగంగా విస్తరిస్తూ, ప్రాణాలను హరిస్తూనే ఉంది. బ్రిటన్, బ్రెజిల్, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్స్ భయపెడుతుండగానే.. శ్రీలంకలో కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసింది. లంక దేశంలోని ప్రముఖ జయవర్ధన్ యూనివర్శిటీ ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్స్ విభాగాధిపతి నీలికా మాలవీగే ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ గురించి చెప్పారు.
గాలి ద్వారా వ్యాపించే ఈ కొత్త రకం కరోనా ఇప్పటి వరకు కనుగొన్న రకాలతో పోలీస్తే చాలా ఉద్దృతంగా విస్తరిస్తోందని చెప్పారు. ఇది గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని చెప్పారు. ఇంక్యుబేషన్ వ్యవధిలో 3 దశలుగా మార్చు చెందుతుందని.. ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్, పాకిస్తాన్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలకు వ్యాప్తి చెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వైరస్ సోకిన యువకులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆక్సిజన్ అందుబాటులో లేకుండా రోగి గాలి పీల్చుకోవడం అసంభవమని స్పష్టంచేశారు. రాబోయే రెండు వారాలు శ్రీలంకలో తీవ్రమైన పరిస్థితి ఎదురుకావచ్చని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.