సింగపూర్‌లో కొత్త కరోనా వేరియంట్.. మానవాళికి ఈ టెన్షన్ ఏమిటో..
New Corona Variant In Singapore. కొత్త వేరియంట్లు కంగారుపెడుతూ ఉన్నాయి. ఒక వేరియంట్ ను కట్టడి చేశామని ఆనందించే లోపే.. మరో వేరియంట్ మనుషుల మీద పడుతూ ఉంది.
By Medi Samrat Published on 18 May 2021 12:49 PM GMTకరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఎన్నో దేశాలు.. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. కొన్ని దేశాలు కరోనాను కట్టడి చేశామని భావిస్తూ ఉన్నా.. కొత్త వేరియంట్లు కంగారుపెడుతూ ఉన్నాయి. ఒక వేరియంట్ ను కట్టడి చేశామని ఆనందించే లోపే.. మరో వేరియంట్ మనుషుల మీద పడుతూ ఉంది. దీంతో మనుషుల్లో సరికొత్త కలవరం మొదలైంది. ఇప్పుడు సింగపూర్ లో కొత్త వేరియంట్ కలకలం మొదలైంది. ఈ వేరియంట్ ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపిస్తూ ఉండడంతో స్కూళ్లను మూసివేశారు.
భారతదేశంలో కేసుల పెరుగుదలకు కారణమైన కరోనా కొత్త స్ట్రెయిన్ బి.1.617 తాజాగా సింగపూర్ లో వెలుగుచూసింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్‌కు బీ.1.617 స్ట్రేయిన్ కారణమని పలు అధ్యయనాలు తెలుపగా.. ఇదే తరహా వైరస్ ఇప్పుడు సింగపూర్‌లో కేసుల పెరుగుదలకు కారణంగా మారింది. బుధవారం నుంచి సింగపూర్ లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మే 28తో విద్యాసంవత్సరం పూర్తి కానుండగా, అప్పటివరకు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. బి.1.617 స్ట్రెయిన్ పిల్లలపై అత్యధిక ప్రభావం చూపిస్తోందని సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యే కుంగ్ తెలిపారు. జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన ఈ వేరియంట్లు చిన్నారుల మధ్య వేగంగా వ్యాప్తిచెందుతున్నాయని వెల్లడించారు.
సింగపూర్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ నూతన స్ట్రెయిన్ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లో కొవిడ్-19 థర్డ్ వేవ్ వ్యాప్తిలో సింగపూర్ కొవిడ్ స్ట్రెయిన్ విరుచుకుపడవచ్చని హెచ్చరించారు. సింగపూర్ నుంచి విమాన రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని, చిన్నారులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగపూర్ స్ట్రెయిన్ థర్డ్ వేవ్ రూపంలో భారత్ ను తాకవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులను కాపాడుకునేందుకు మనం వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని ఆయన ట్వీట్ చేశారు. కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ మొదలవ్వడానికి కారణమవుతున్నాయి.