జైల్లో నిరాహార దీక్షకు దిగిన ప్రతిపక్ష నేత

Navalny's Tumultuous Return to Russia. జైల్లో శిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నావల్ నిరాహార దీక్ష

By Medi Samrat  Published on  2 April 2021 3:23 AM GMT
Navalny’s Tumultuous

జైల్లో శిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నావల్ నిరాహార దీక్షకు దిగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదని, దీంతో తను బరువు కూడా తగ్గిపోయానన్నారు ఆరోపించారు. అధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ అలెక్సీ నావల్నీ జైలు అధికారికి ఓ లేఖ రాశారు. రాత్రి సమయాల్లో ప్రతి గంట గంటకూ నిద్ర లేపుతూ తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని.. తనకు చికిత్స నిరాకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన అనారోగ్యాన్ని పరీక్షించేందుకు నిపుణుడిని లోనికి అనుమతించాలని జైలు అధికారులకు విన్నవించినప్పటికీ.. వారం గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్లు నావల్నీ ప్రకటించారు.

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ విడుదల చెయ్యడం కోసం గతకొన్ని రోజుల క్రితం రష్యాలో ప్రధాన నగరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. నావల్నీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆందోళనలకారులను నిలువరించేందుకు అనేక చోట్ల లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్​, యెకాటెరిన్బర్గ్​, యుజ్నో-సఖాలిన్స్క్‌ సహా మొత్తం 90​ నగరాల్లో దాదాపు 3000 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు.

ఇదిలాఉంటే, 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఈ జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం నావల్నీని జైలుకు తరలించారు. తాజాగా అక్కడి జైలు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలతో నావల్నీ నిరాహార దీక్షకు దిగారు.



Next Story