భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి కాలంలో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లుగా భావిస్తూ ఉండగా.. పాకిస్తాన్ హక్కుల కార్యకర్త, నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నవయసులోనే బాలికల విద్యా హక్కు కోసం పోరాడి తాలిబాన్ల తుపాకీ తూటాలు ఎదుర్కొన్న మలాలా భారత్-పాకిస్థాన్ కలిసి మెలిసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఒకప్పటి విధానాలు ఇప్పుడు పనిచేయవని.. ప్రస్తుతం ఇరు దేశాల ప్రజలు విద్వేషాలను మర్చిపోయి శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారని అన్నారు.
భారత్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో భాగంగా మలాలా యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాలా' పుస్తకంపై ఆమెతో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగానే ఆమెతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలాలా.. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ దేశాలు మంచి స్నేహితులుగా మారాలన్నదే తన కల అని మలాలా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని, వారి రక్షణకు అన్ని దేశాలూ కలిసిరావాలని కోరారు. పాకిస్తాన్, భారత్‌లే కాదు.. అన్ని దేశాల్లోనూ మైనారిటీలు ఇబ్బందుల్లోనే ఉన్నారు. దీనికి కారణం మతం కాదు. అధికార దురహంకారం వల్ల జరుగుతోంది. దీనిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ కళాకారులు ప్రదర్శించే నాటకాలను భారతీయులు తిలకించవచ్చు... మేం కూడా బాలీవుడ్ సినిమాలను, క్రికెట్ మ్యాచ్ లను హాయిగా ఆస్వాదించవచ్చు అని అన్నారు.