కరుడుగట్టిన తీవ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి జకీర్ రెహమాన్ లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో లష్కరే కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. ముంబై దాడుల కేసులో 61 ఏళ్ల లఖ్వీ 2015 నుంచి బెయిలుపై ఉన్నాడు. గత శనివారం అతడిని పంజాబ్ ప్రావిన్స్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) అరెస్ట్ చేసింది. అయితే.. అతడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. భారత దేశం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ముంబై పేలుళ్ల ఘటనపై తగిన ఆధారాలు బయటపెట్టింది. దీంతో చేసేది లేక పాక్ లఖ్వీని అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్టు ఆరోపిస్తూ ఉగ్రవాద నిరోధక చట్టం 1977 కింద లఖ్వీపై సీటీడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) తాజాగా లఖ్వీని దోషిగా తేల్చింది. ఒక్కో అభియోగం కింద ఐదేళ్లు చొప్పున మొత్తం 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బట్టర్ తీర్పు వెలువరించారు.