అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీని ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి గస్తీ బృందం అధికారి వాట్సన్ తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కాలిఫోర్నియాలోని హాల్ట్ విల్లే సమీపంలోని నోరిష్ రోడ్‌లో ఈ ఉదయం 6.15 గంటల ప్రాంతంలో యూఎస్‌వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటనాస్థలంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరొకరిని ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు. వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్‌యూవీలో 27 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
ఎస్‌యూవీని ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో అందులో చిక్కకుకన్నవారిని, మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించారు. బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న వారిగా గుర్తించారు. మృతులంతా వ్యవసాయ కూలీలై ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. వారిలో 10 మంది మెక్సికో పౌరులు ఉన్నట్లు తెలిపారు. అయితే.. ఎస్‌యూవీ వాహనంలో ఉన్నది రెండు సీట్లేనని.. ఎనిమిది మంది వరకు మాత్రమే కూర్చొనే వీలుందని.. అయితే.. అంత మంది ఎలా వెలుతున్నారో తెలియడం లేదన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.