మయన్మార్ లో ఆగని మారణ హోమం

More than 80 people have been killed by Myanmar security forces.తాజాగా శని, ఆదివారాల్లో మయన్మార్ సైనికులు జరిపిన కాల్పుల్లో సుమారు వంద మంది మరణించినట్లు తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 12 April 2021 8:45 AM IST

Myanmar News

మయన్మార్‌లో మరోసారి మారణహోమం చెలరేగింది. తాజాగా శని, ఆదివారాల్లో మయన్మార్ సైనికులు జరిపిన కాల్పుల్లో సుమారు వంద మంది మరణించినట్లు తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలను మయన్మార్ మిలిటరీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. అయినా సరే ప్రజలు సైతం తగ్గేది లేదంటున్నారు. సైనిక చర్యలకు నిరసనగా ఆదివారం రాత్రి ఫ్లాష్ స్ట్రైక్ నిర్వహించారు. అన్ని నగరాలు, పట్టణాలలో చీకటిలో టార్చ్ లు, మైబైల్ ఫ్లాష్ లైట్ లు, కొవ్వాత్తుల వెలుగులతో తమ నిరసనలు ప్రపంచానికి తెలియజేసారు.

ప్రజాస్వామ్య అనుకూలవాదులపై బాగో నగరంలో జరిపిన కాల్పుల్లో శనివారం ఒక్కరోజే 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అసిస్టెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ అనే స్వతంత్ర సంస్థ ఈ గణాంకాలను ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మయన్మార్‌ నౌ అనే వెబ్‌సైట్‌ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. సైనికవాహనాల్లో మృతదేహాలను తీసుకెళ్లి పగోడా వద్ద పడేశారని తెలిపింది. ఆందోళనకారులపైకి మయాన్మార్ మిలిటరీ భారీ ఆయుధాలను, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడ్లను, మోర్టార్లను ప్రయోగిస్తోందని పేర్కొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఏడాదిపాటు అధికారాన్ని తమ వద్దే ఉంచుకుంటామని ప్రకటించింది. ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు యు విన్ మియింట్ సహా పలువురు నేతలను నిర్బంధించింది. ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని సైన్యం హస్తగతం చసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సైన్యంపై నిరసనలు వెల్లువెత్తాయి. వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వారిని అణచివేసేందుకు సైన్యం జరుపుతున్న కాల్పుల్లో వందలాదిమంది మరణించారు.


Next Story