ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతూ ఉంది. సొంతంగా కొన్ని దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేసుకుంటే.. ఇంకొన్ని దేశాలు ఇతర దేశాల నుండి తెప్పించుకుంటూ ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ల వలన సైడ్ ఎఫెక్ట్స్ సర్వ సాధారణం అని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి కరోనా వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కొన్ని అలర్జీలు ఉన్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. అయితే అమెరికా సంస్థ మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువేనని అంటున్నారు. మోడెర్నా తయారు చేసిన కరోనా టీకాతో దుష్ప్రభావాలు చాలా చాలా అరుదని ఆ దేశ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది.
మోడెర్నా టీకాను గత ఏడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు 40 లక్షల 41 వేల 396 మందికి వేస్తే.. కేవలం 10 మందికే అత్యంత తీవ్రమైన దుష్ప్రభావాలు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత చికిత్స చేయడం ద్వారా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలుగలేదని తెలిపింది. పది మందిలో తొమ్మిది మందికి వ్యాక్సిన్ కు ముందే అలర్జీలు ఉన్నాయని సీడీసీ తెలిపింది. అందులో ఐదుగురికి అనాఫైలాక్సిస్ (ఆహారం, మందుల వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావం/అలర్జీ) ఉందని తెలిపింది. దుష్ప్రభావాలు కలిగిన ఆ పది మందిలో తొమ్మిది మందికి వ్యాక్సిన్ వేసుకున్న 13 నిమిషాల్లోనే వాంతులు, వాంతి వచ్చినట్టు అనిపించడం, ఊపిరి తీసుకోలేకపోవడం, నాలుక వాపు, దద్దుర్లు వంటి దుష్ప్రభావాలు వచ్చాయని స్పష్టం చేసింది. కాగా, మోడెర్నా టీకాను అత్యధికంగా మహిళలకే వేశారట. ఈ టీకా తీసుకున్నవారిలో మహిళల వాటానే 24 లక్షల 65 వేల 411 (61%) అని పేర్కొంది. 14 లక్షల 50 వేల 966 మంది పురుషులకు మోడెర్నా టీకాను ఇచ్చారు.