పాకిస్థాన్ లో మతం అంటే పిచ్చి. ఒక ఉన్మాదం. అలాంటి దేశంలో మత ప్రవక్తను ఏమన్నా అంటే ఊరుకుంటారా. అందరూ ఒక్కటైపోయి ఆ మాటలు అన్న వ్యక్తి పై దాడికి దిగుతారు. తాజాగా అలాంటి సంఘటనే ఇస్లామాబాద్ లోని గోర్లా పోలీస్ స్టేషన్ లో జరిగింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే కొందరు అతని వ్యాఖ్యలతో తీవ్రంగా మనస్తాపం చెందారు. నిందితుడి కోసం అన్ని చోట్ల వెతికారు. కనిపించకపోయే సరికి ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేశారు. అక్కడ కూడా ఆ వ్యక్తి కనపడకపోయేసరికి పోలీసులపై తిరగబడ్డారు. స్టేషన్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వందల సంఖ్యలో జనాలు ఒక్కసారిగా స్టేషన్ పై దాడి చేయడం తో తీవ్ర భయాందోళనలకు గురైన పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఘటన పై సమాచారం అందుకున్న కౌంటర్ టెర్రరిజం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ రియోట్స్ యూనిట్ల నుంచి వందల బలగాలు వెంటనే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. సుమారు గంట తర్వాత అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నిందితుడిని పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టు సమాచారం.
పాకిస్తాన్‌లో దైవదూషణను ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. దైవదూషణ చేసినట్లు రుజువైతే వారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు. అయితే మైనారిటీలను బెదిరించేందుకు, వ్యక్తిగత కక్షలు సాధించేందుకు దైవదూషణ ఆరోపణలను ఒక అస్త్రంగా ఉపయోగిస్తారని కూడా ఆరోపణలు ఉన్నాయి.