సాదారణంగా ఓ అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. అయితే.. ఇక్కడ మాత్రం ఇద్దరు అందగత్తెలు వివాహబంధంతో ఒక్కటి అయ్యారు. గత కొన్నాళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటున్న ఈ సుందరీమణులు తాజాగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మిస్ అర్జెంటినా 2020 మారియానా వరేలా, మిస్ ప్యూర్టోరికో 2020 ఫాబియోలా వాలెంటిన్ లు తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. "మా సంబంధాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత, మేము ఒక ప్రత్యేక రోజు కోసం మా తలుపులు తెరిచాము" అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చారు. 28 అక్టోబర్ 2022న తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. గత రెండేళ్లుగా వారిద్దరి మధుర జ్ఞాపకాల ఫోటోలను వీడియోగా పంచుకున్నారు.
వాళ్లిద్దరికీ మిస్ గ్రాండ్ ఇంటర్నేషన్-2020 బ్యూటీ పోటీల్లో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారిద్దరు డేటింగ్ చేస్తున్నారు. తాజాగా పెళ్లిచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వారి అభిమానులు, తోటీ పోటీదారులు శుభాకాంక్షలు తెలిపారు. "అభినందనలు ఎంజీఐ ఒక అందమైన యూనియన్‌ను కలిపింది" అని 2020లో పోటీని గెలుచుకున్న ఘనియన్ మోడల్ అబెనా అకుబాబా అంది.
కాగా.. స్వలింగ వివాహం ప్యూర్టో రికోలో 2015 నుంచి అర్జెంటీనాలో 2010 చట్టబద్ధం చేశాయి.