లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 28 మంది దుర్మ‌ర‌ణం

By Medi Samrat  Published on  24 Nov 2024 7:48 AM IST
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 28 మంది దుర్మ‌ర‌ణం

ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో శనివారం లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 28 మంది చనిపోయారు. సెంట్రల్ బీరుట్‌లో వైమానిక దాడుల్లో 15 మంది మరణించారని.. రాజధానికి ఈశాన్య ప్రాంతంలో జ‌రిగిన‌ దాడుల్లో 13 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

లెబనాన్ రాజధానిపై ఈ వారంలో నాలుగోసారి దాడి జరిగింది. లెబనీస్ భద్రతా అధికారుల ప్రకారం.. సెంట్రల్ బీరుట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనం లక్ష్యంగా చేసుకుంది. దానిపై నాలుగు క్షిపణులను ప్రయోగించారు. టన్నెల్ ధ్వంసం చేసే క్షిపణులను దాడిలో ఉపయోగించారు. దాడి జరిగిన ప్రదేశంలో లోతైన గొయ్యి ఉంది.

ఇజ్రాయెల్ వైమానిక దళం బీరుట్ దక్షిణ శివారులోని ప‌లు హిజ్బుల్లా స్థానాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ ఇటీవల లెబనాన్, ఇజ్రాయెల్‌లను సందర్శించారు. అక్టోబరు 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌లో భారీ దాడి చేసింది. అప్పటి నుంచి గాజాలో హమాస్‌ను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగిస్తోంది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుండి దాడి చేస్తున్న హిజ్బుల్లాపై కూడా ఇజ్రాయెల్ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటివరకు 44,176 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Next Story