వజ్రల వ్యాపారి మెహుల్ చోక్సీ మిస్సింగ్
Mehul Choksi Missing In Antigua. ప్రముఖ వజ్రాల వ్యాపారి, గీతాంజలి గ్రూపు చైర్మన్ మెహుల్ చోక్సీ కనబడకుండా పోయాడు.
By Medi Samrat Published on 25 May 2021 3:15 PM ISTపంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్లు ఎగొట్టి ఎంచక్కా భారత్‌ను విడిచి పెట్టి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి, గీతాంజలి గ్రూపు చైర్మన్ మెహుల్ చోక్సీ కనబడకుండా పోయాడు. కోట్ల రూపాయల డబ్బులు ఎగనామం పెట్టేసి దేశం నుంచి పారిపోయి కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడే ఉంటుండగా ఆయనను స్వదేశానికి రప్పించేందుకు మన అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. మెహుల్ చోక్సీ అక్కడ కూడా అదృశ్యమయ్యారు. చోక్సీ కోసం ఆంటిగ్వా పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఈనెల 23 సాయంత్రం ఆయన తన ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీ వాహనాన్ని సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. ఛోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్.. ఆంటిగ్వాను కోరినప్పటికీ అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అతడికి పౌరసత్వం ఇచ్చామని, అయితే భారత అధికారులు చెప్పే విషయాలకు పరిగణనలోకి తీసుకుంటామని చెబుతూ వస్తోంది.
అయితే ఇటీవల భారత్ నుంచి ఒత్తిడి పెరగడంతో ఛోక్సీ ఇప్పుడు ఆంటిగ్వా వదిలివెళ్లి ఉంటాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన క్యూబాకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. నీరవ్ మోదీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతారు. ఛోక్సీపై భారత్‌లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఇక నీరవ్ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్న విషయం విదితమే. ఇప్పుడిప్పుడే నీరవ్ మోదీని ఇండియా తీసుకు రావడానికి మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో చోక్సీ మిస్సింగ్ తలనొప్పిగా మారింది.