దారుణం.. కత్తులతో దాడి.. 10మంది మృతి

Mass stabbing in Canada leaves 10 dead. కెనడా దేశంలో దారుణం జరిగింది. సస్కాచెవాన్‌ ప్రాంతంలోని 13 చోట్ల ఇద్దరు దుండగులు కత్తులతో విధ్వంసానికి దిగారు

By అంజి  Published on  5 Sep 2022 3:01 AM GMT
దారుణం.. కత్తులతో దాడి.. 10మంది మృతి

కెనడా దేశంలో దారుణం జరిగింది. సస్కాచెవాన్‌ ప్రాంతంలోని 13 చోట్ల ఇద్దరు దుండగులు కత్తులతో విధ్వంసానికి దిగారు. కత్తిపోట్లకు గురై 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికిపైగా కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ రోండా బ్లాక్‌మోర్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి తమకు మొదటి కాల్ ఉదయం 5.40 గంటలకు వచ్చిందన్నారు.

ఆ తరువాత వరుసగా పలు చోట్ల నుంచి కత్తి దాడుల గురించి తమకు ఇన్ఫర్మేషన్‌ అందిందని తెలిపారు. కొంతమందిని టార్గెట్‌ చేసుకుని ఈ దాడి చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరులను యాధృచ్చికంగా చంపేసి ఉంటారని తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను డామియన్ శాండర్సన్, మైల్స్ శాండర్సన్‌గా పోలీసులు పేర్కొన్నారు. వారు నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరిని తమ దగ్గరకు రానివ్వద్దని, పరిచయం లేని వ్యక్తులను వాహనాలు ఎక్కించుకోవద్దని ప్రజలకు సూచనలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రొవిన్షయల్ రాజధాని రెజీనాలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు స్థానికుల నుంచి పోలీసులకు చివరిసారిగా సమాచారం అందింది. దీంతో సరిహద్దు ప్రావిన్స్‌లు మనితోబా, అర్బర్టాలలోనూ నిందితులకోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ ఘటన అనంతరం సస్కాచెవాన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ ప్రొటొకాల్‌ను ప్రకటించింది. నిందితులు డామియన్ శాండర్సన్ (31), మైల్స్ శాండర్సన్‌(30)గా పోలీసులు ఫొటోలను విడుదల చేశారు. ఈ ఘటన ఆధునిక కెనడియన్ చరిత్రలో అత్యంత ఘోరమైన సామూహిక హత్యలలో ఒకటి.

"ఈరోజు సస్కాచెవాన్‌ జరిగిన దాడులు భయంకరమైనవి. హృదయ విదారకమైనవి. నేను ప్రియమైన వారిని కోల్పోయిన వారి గురించి, గాయపడిన వారి గురించి ఆలోచిస్తున్నాను" అని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సందేశంలో తెలిపారు.

Next Story