ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బహావల్‌పూర్ మీద భారతదేశం జరిపిన దాడిలో తమ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించారని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ తొలిసారిగా అంగీకరించింది. భద్రతా సిబ్బంది పక్కన ఉన్న జైష్ అగ్ర కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఉగ్రవాద సంస్థకు జరిగిన నష్టాలను ఒప్పుకున్నారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మే 7న బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో అజార్ కుటుంబం ముక్కలైపోయిందని కశ్మీరీ ఒప్పుకున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు మరణించిన ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ను భారత సైన్యం ప్రారంభించింది. పలు ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. లాహోర్ నుండి 400 కి.మీ దూరంలో ఉన్న పాకిస్తాన్‌లోని నగరమైన బహవల్‌పూర్‌పై జరిగిన దాడిలో, అజర్ బంధువులు 10 మంది మరణించారు. ఇందులో అతని సోదరి, ఆమె భర్త, అతని మేనల్లుడు, అతని మేనకోడలు, అతని కుటుంబంలోని పిల్లలు ఉన్నారు. తెల్లవారుజామున జరిగిన దాడిలో అజర్ సహాయకులు నలుగురు కూడా మరణించారు.