పాకిస్తాన్‌లో హిందూ మహిళ ఘనత.. ఎందరికో ఆదర్శం
Manisha Ropeta is Pakistan's first Hindu woman senior cop.ఓ హిందూ మహిళ పాకిస్థాన్‌లో అరుదైన ఘనత సాధించింది.
By తోట వంశీ కుమార్ Published on 29 July 2022 6:37 AM GMTఓ హిందూ మహిళ పాకిస్థాన్‌లో అరుదైన ఘనత సాధించింది. పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు అందుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పురుషాధిక్యత కలిగిన పాకిస్థాన్ వంటి దేశాల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణించడం చాలా అరుదు. అందువులో హిందువులు అంటే చిన్న చూపు చూస్తారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో మనీషా రోపేటా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. మనీషా రోపేటా(26) సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్‌లో ఓ మధ్య తరగతి హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె 13 ఏట తండ్రి చనిపోవడంతో తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను ఎంతో కష్టపడి పెంచింది. ఎంతో కష్టపడి చదివిన మనీషా సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మనీషా రోపేటా డీఎస్పీగా లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత మనీషా రోపేటా మాట్లాడుతూ.. నిజానికి తాను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నట్లు చెప్పింది. ఆమె సోదరీమణులు ముగ్గురు డాక్టర్లే కావడం, ఆమె తమ్ముడు కూడా ప్రస్తుతం డాక్టర్ కోర్సు చదువున్నాడు. అయితే.. తాను ఒక్క మార్కు తేడాతో మెడిసిన్‌సీటు కోల్పోయానని, ఆ సమయంలో ఫిజికల్ థెరపీ కోర్సు చేయాలనుకున్నట్లు చెప్పింది. అయితే సింధు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి అర్హత సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపింది.
చిన్నతనం నుంచి.. తాను, తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్టు తెలిపారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని, అలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్టు స్పష్టం చేశారు.