ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ నిర్ధారణ..!
Man claims he had monkeypox and coronavirus at the same time.కరోనా మహమ్మారి బారి నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు.
By తోట వంశీ కుమార్ Published on 24 July 2022 11:59 AM ISTకరోనా మహమ్మారి బారి నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. మరో మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అదే మంకీపాక్స్. గత కొద్ది రోజులుగా పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ సోకిన వారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర స్థితిని ప్రకటించింది.
కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. అమెరికాకు చెందిన ఆ వ్యక్తిలో రెండు వైరస్‌లను శనివారం గుర్తించారు. ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లు గుర్తించటం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు జూన్ చివరి వారంలో కరోనా వైరస్ సోకింది. కొన్ని రోజులకు అతడి శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపురంగులో పొక్కులు రావడం మొదలయ్యాయి. అతడికి అనుమానం వచ్చి వైద్యులను ఆశ్రయించాడు. పరీక్షించిన వైద్యులు అతడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 'నాకు మంకీపాక్స్, కరోనా వైరస్ రెండూ ఉన్నాయని వైద్యులు కచ్చితంగా చెప్పారు.' అని ఓ ఛానల్‌కు అతడు తెలిపాడు. అమెరికా మీడియాలో వెలువడినప్పటికీ అధికారికంగా ఈ విషయాన్ని నిర్థారించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 75 దేవాలకు మంకీఫాక్స్ వ్యాపించింది. మొత్తం నమోదైన కేసుల్లో దాదాపు 95శాతానికి పైగా కేసులు స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూస్తున్నట్లు నివేదికలు రావడంతో అటువంటి వారిని పరిశీలిస్తుండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.