కొత్త చట్టం వస్తోంది.. 2007 తరువాత పుట్టిన వాళ్లు స్మోకింగ్ చేయడానికి వీల్లేదు
Malaysia follows New Zealand discusses bill to prohibit tobacco sales.ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి
By తోట వంశీ కుమార్ Published on 28 July 2022 1:29 PM IST
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలిసిందే. అయిన్పటికీ కొందరు ఈ అలవాటును మానటం లేదు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. మనదేశంలో ధూమపాన అర్హత వయస్సు 21 కి పెంచాలని కేంద్రం బావిస్తోండగా కొన్ని దేశాలు మాత్రం ధూమపానంపై నిషేదం విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి.
ఈ విషయంలో అన్ని దేశాల్లో కన్నా న్యూజిలాండ్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లో ధూమపానంపై నిషేదం విధంగా ఇప్పుడు మలేషియా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2007 తర్వాత జన్మించిన వ్యక్తులకు ఇ-సిగరెట్‌లతో సహా అన్ని పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని నిషేదించాలని బావిస్తోంది. ఈ మేరకు ఓ చట్టాన్ని తీసుకువచ్చే పనిలో ఉంది.
మలేషియా ఆరోగ్య మంత్రి ఖైరీ జమాలుద్దీన్ బుధవారం పార్లమెంట్‌లో పొగాకు మరియు ధూమపాన నియంత్రణ బిల్లు 2022ను సమర్పించారు. ఈ బిల్లు ఆగస్టు 4న ముగిసే సెషన్‌లో చర్చకు రానుంది. అప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన చెప్పారు.
ఈ బిల్లు కనుక ఆమోదించబడినట్లయితే జనవరి 1, 2007న లేదా ఆ తర్వాత జన్మించిన వారు 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులను ధూమపానం చేయడం, కొనుగోలు చేయడం లేదా స్వంతం చేసుకోవడం చట్టవిరుద్దం. అంటే.. 2007లో పుట్టిన పిల్లలకు ప్రస్తుతం 15 ఏళ్లు ఉంటాయి. ఇప్పుడు వీరు ధూమపానం చేసేందుకు అర్హత లేదు. అలాగని 18 ఏళ్లు దాటిన తరువాత కూడా ధూమపానం చేయడానికి వీల్లేదు. క్లుప్తంగా చెప్పాలంటే 2007 తరువాత పుట్టిన వాళ్లెవరూ ఇకపై జీవితాంతం స్మోకింగ్ చేయడానికి వీళ్లేదు. వీళ్లకి ఎవరైనా ఈ సిగరేట్లు అమ్మినా, లేదా వీరు కొన్నా, కలిగి ఉన్నా చట్టప్రకారం శిక్షలు విధిస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు పొగాకును ఉపయోగిస్తున్నారు.