పాకిస్థాన్‌లో లాక్ డౌన్..!
Major lockdown imposed in 7 Pakistan cities.తాజాగా పాకిస్థాన్ లో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. పాకిస్తాన్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు.
By తోట వంశీ కుమార్ Published on 14 March 2021 7:40 PM ISTకరోనా వైరస్ తీవ్రత తగ్గిందని భావించిన ప్రజలకు మహమ్మారి మరోసారి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోని పలు దేశాలు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా.. తాజాగా పాకిస్థాన్ లో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. పాకిస్తాన్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని ఏడు నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. లాహోర్, రావల్పిండి, సర్గోధ, ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రన్‌వాలా, గుజరాత్ నగరాల్లో రెండు వారాల పాటు లాక్‌డౌన్ అంక్షలు అమల్లోకి రానున్నాయి. సోమవారం నుంచి ఏడు నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్ పాటించాలని ప్రజలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో విమానాలపై విధించిన ఆంక్షల వ్యవధిని కూడా పాక్ ప్రభుత్వం పొడిగించింది. ఈ పరిమితులను మార్చి 18 వరకు పొడిగించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు పాక్ వ్యాప్తంగా 6 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 13,476 మంది మరణించినట్లు సమాచారం. అయితే పాకిస్థాన్ లో కరోనా కేసులు అంతకు మించి నమోదయ్యాయని.. కానీ పాక్ అధికారులు లెక్కలు కరెక్ట్ గా లేవని కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఇక పాకిస్థాన్ కు వ్యాక్సిన్ భారత్ సరఫరా చేయనుంది. భారత్ లో తయారైన వ్యాక్సిన్ లను పాక్ కు సరఫరా చేసేందుకు అంగీకరించింది. గవి ఒప్పందంలో భాగంగా ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పాక్ కు ఎగుమతి చేయబోతున్నారు. మొత్తం 4.5 కోట్ల టీకాలను పాక్ కు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా జూన్ నాటికి 1.6 కోట్ల డోసులను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నది. ఇటు పాక్ కు చైనా కూడా 5 లక్షల టీకాలను పంపనుంది.