న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ దీని తీవ్రత 7.1గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గురువారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం భూమికి 10కి.మీ లోతులో ఉన్నట్లు గుర్తించింది. భూకంప కేంద్రం నుంచి 300కి.మీ వ్యాసార్థంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జనావాసాలు లేని ద్వీపాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. న్యూజిలాండ్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.
ప్రపంచంలోని రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు అయిన పసిఫిక్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ సరిహద్దులో న్యూజిలాండ్ ఉంటుంది. దీని కారణంగా ఆ దేశంలో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. గత నెల 15న భారీ భూకంపం సంభవించింది. రాజధాని వెల్లింగ్టన్ సమీపంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది.