తైవాన్‌లో బుధవారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత 6.6గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని భవనాలు ఊగిపోయాయి. తైపీ నగరానికి దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో ఒకటి, హుయాలిన్ నగరానికి దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో మరో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా.. భూకంపకాల కారణంగా ఇంత వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
కాగా.. హువాలియన్, టైటుంగ్ రెండూ పర్వత ప్రాంతాలు కావడంతో జనాభా తక్కువగా ఉంటుందని ఈ కారణంగా ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇక.. తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. దీంతో అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2 వేల మందికిపైగా మరణించగా.. 2016లో దక్షిణ తైవాన్ లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు.