అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో తెల్లవారుజామున 2.30 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఫెర్న్‌డాలేకు 12 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 16.1 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ప్రకంపనల కారణంగా విద్యుత్ సరఫరా దెబ్బతింది.
హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల మేరకు దాదాపు 12 వేల మంది అంధకారంలో చిక్కుకుపోయారు. వాణిజ్య సముదాయాలు, ఇళ్లకు విద్యుత్ సరఫరా, నీటీ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు, భవనాలు కుంగిపోయాయి. ప్రకంపనల కారణంగా భవనాల కీటీకీల అద్దాలు పగిలిపోయాయి. భూకంపం సంభవించిన సమయంలో లేదా ఆ తర్వాత సంభవించిన వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కనీసం 11 మందికి గాయాలయ్యాయి.
భూ ప్రకంపనల వల్ల ధ్వంసమైన ఇళ్లు, చెల్లా చెదరుగా పడిపోయిన వస్తువుల ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.