భారత్‌కు అండ‌గా నిలిచేందుకు.. లండన్ టు ఢిల్లీ బైకథాన్

'London to Delhi' cycle raises cash for India's COVID crisis.భారత్ ను ఆదుకునేందుకు ప్రవాస భారతీయులు సైతం తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

By Medi Samrat  Published on  3 May 2021 1:57 AM GMT
london to delhi cycle crises

కరోనాతో క్షణం తీరిక లేకుండా పోరాడుతున్న భారత్ ను ఆదుకునేందుకు ప్రవాస భారతీయులు సైతం తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయమైన శ్రీ స్వామినారాయణ మందిర్.. భారత్ ను ఆదుకునేందుకు ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.

భారత్ కు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో 5 లక్షల పౌండ్లు అంటే సుమారు రూ.5.12 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా లండన్ టు ఢిల్లీ అనే బైకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నియాస్డెన్ లో ఉన్న ఆ దేవాలయ ప్రాంగణంలో 'సైకిల్ టు సేవ్ ద లైవ్స్' పేరిట ఈ బైకథాన్ రైడ్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేవాలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన స్టాటిక్ సైకిళ్లను వాలంటీర్లు తొక్కుతారు. రెండు రోజుల ఈ కార్యక్రమంలో ఉన్నచోటే ఉండి దాదాపు 7,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నారు.

భారతీయులతో పాటు అక్కడి దేశస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా 12 స్టాటిక్ సైకిళ్లను గుడి ముందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ఒక్కో వాలంటీర్ 50 నిమిషాల పాటు సైకిల్ ను తొక్కొచ్చు. తన రైడ్ పూర్తయ్యాక ఆ సైకిల్ ను అప్పగించేముందు దానిని 10 నిమిషాల పాటు అదే వాలంటీర్ సైకిల్ ను శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 750 మంది స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు ప్రిన్స్ చార్లెస్ స్థాపించిన బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ కూడా భారత్ కోసం నిధులు సమీకరించే పనిలో ఉన్నారు. కోవిడ్ పై పోరులో భారత్ తో పాటూ మేమంతా ఉన్నామని వీరంతా ప్రజలలో ధైర్యాన్ని నింపుతున్నారు.


Next Story