బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా
Liz Truss resigned as British Prime Minister. పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు.
By అంజి Published on 20 Oct 2022 8:45 PM IST
మొన్నటి వరకు రాజకీయ సంక్షోభం కొట్టుమిటాడిన బ్రిటన్.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బ్రిటన్‌లో నెలలు తిరగకుండానే మరోసారి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో విఫలమవడం, కీలక మంత్రుల నిష్క్రమణపై పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే ఆమె రాజీనామా చేశారు. లిజ్‌ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
ఇటీవలే మినీ బడ్జెట్ ప్రవేశపెట్టి.. లిజ్‌ట్రస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బ్రిటన్‌లో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేయలేక బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్‌తో పోటీ పడి మరీ లిజ్ ట్రస్ విజయం సాధించారు. ఆ వెంటనే కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటన్ పాలనను గాడిలో పెట్టే దిశగా కాస్తంత దూకుడుగా వ్యవహరిస్తూ మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ట్రస్ ప్రకటన విడుదల చేశారు. అదే టైంలో బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం మరోసారి పడగ విప్పింది. ఫలితంగా ట్రస్ మంత్రివర్గంలోని పలువురు మినిస్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రులు రాజీనామాలు చేయడంతో విధి లేని పరిస్థితుల్లో ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా ట్రస్ కేవలం 45 రోజులు మాత్రమే కొనసాగారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా ట్రస్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.