తైవాన్ రాజధాని తైపే నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. మాస్క్, బాడీ ఆర్మర్ ధరించిన ఓ వ్యక్తి ప్రజలపై విచక్షణలేకుండా కత్తితో దాడి చేయడంతో పాటు పెట్రోల్ బాంబులు విసిరాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, తైపే ప్రధాన రైల్వే స్టేషన్‌లో మొదట పొగ బాంబులు (స్మోక్ బాంబ్స్) విసిరిన అనంతరం, సమీపంలోని రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతంలోని మెట్రో (సబ్‌వే) స్టేషన్ వైపు పరుగు తీస్తూ మార్గమధ్యంలో ప్రజలపై దాడులు చేశాడు. ఈ సమయంలో అతడి చేతిలో పొడవైన కత్తి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తైవాన్ ప్రీమియర్ చో జంగ్-టై మాట్లాడుతూ, ఘటన స్థలంలో పెట్రోల్ బాంబుల అవశేషాలు లభించాయని, అనుమానితుడు ముందస్తు ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డట్లు ప్రాథమికంగా అనిపిస్తోందని తెలిపారు. అతడు మాస్క్‌తో పాటు బాడీ ఆర్మర్ ధరించి ఉన్నాడని కూడా పేర్కొన్నారు.
దాడి అనంతరం పోలీసులు వెంటనే అలర్ట్ అయి అనుమానితుడిని వెంబడించగా, ఛేజ్ సమయంలో అతడు ఓ భవనం నుంచి పడిపోవడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, మృతి చెందిన అనుమానితుడికి గతంలో నేర చరిత్ర ఉండటంతో పాటు, పెండింగ్ వారెంట్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. అతడి నివాసాన్ని పోలీసులు తనిఖీ చేశారని, దాడికి గల కారణాలు, వెనుక ఉన్న సంబంధాలు, ప్రేరణలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడతామని ప్రీమియర్ చో జంగ్-టై స్పష్టం చేశారు. అనుమానితుడిని చాంగ్ (Chang) అనే ఇంటిపేరుతో మాత్రమే గుర్తించారు.
సాధారణంగా తైవాన్‌లో హింసాత్మక నేరాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రజా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.