ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత విషయాలు బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే. ఆయన కుటుంబంలో ఎంత మంది ఉంటారు..? వారి పేర్లు ఏమిటో కూడా తెలీదు. అలాంటి కిమ్ అందరిని ఆశ్చర్యపరుస్తూ తొలిసారి తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఖండాంతర క్షిపణి ప్రయోగానికి ముందు దానిని పరిశీలించేందుకు ఆయన తన కుమార్తెను వెంటబెట్టుకొచ్చాడు.
ఎపెక్(ఆసియా పసిఫిక్ తీర దేశాల ఆర్థిక సహకార మండలి) శిఖరాగ్ర సమావేశం థాయ్‌లాండ్‌లో జరుగుతుండగా ఉత్తర కొరియా వాసాంగ్-17 ఖండాంతర క్షిపిణిని శుక్రవారం పరీక్షించింది. ఇది అణ్వస్త్రాన్ని మోస్తూ అమెరికా భూ భాగాన్ని సైతం తాకగలదు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కిమ్.. తన కూతరితో కలిసి వచ్చాడు.
ఆ చిన్నారి చేయి పట్టుకుని కిపణీ ప్రయోగ ప్రాంగణం అంతా తిరిగాడు. వీరిద్దరూ ప్రయోగ కేంద్రం వద్ద సందడి చేసిన ఫోటోలను కొరియా న్యూస్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చాయి. అయితే.. ఆ చిన్నారి పేరు ఏంటో మాత్రం వెల్లడించలేదు.కాగా.. కిమ్‌కు ఇద్దరు కుమారైలు, ఓ కుమారుడని గతంలో వార్తలు వినిపించాయి.
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షతో జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి చెందిన హొక్సైడో రీజియన్‌లోని ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ సముద్ర జలాల్లో క్షిపణి పడిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వెల్లడించారు. ఉత్తర కొరియా చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని చెప్పారు.