సామాన్యులకు షాక్.. కేజీ చికెన్ రూ.650.. కొనాలంటే భయపడుతున్న జనం
KG Chicken rs 650 in Pakistan.ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే.
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2023 8:00 AM ISTఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొందరికి రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు. కరోనా తరువాత చాలా మంది పోషకాహారం కోసం మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్నారు. నాన్ వెజ్‌ను ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతుండగా వాటి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న కోడి ధర ఇప్పుడు చుక్కలను తాకుతోంది. కేజీ చికెన్ రేటు మూడొందలు కాదు నాలుగొందలు కాదు ఏకంగా రూ.650 కి చేరింది. అయితే.. ఇది మనదేశంలో కాదులెండి. పొరుగున్న ఉన్న పాకిస్థాన్‌లో.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ఇప్పటికే గోధుమ పిండి, గ్యాస్ సిలిండర్ ధరలు కొండెక్కగా.. తాజాగా చికెన్ రేటు చుక్కలను తాకింది. పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడంతో చికెన్ ధరలు నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 80శాతానికి పైగా పెరిగింది. నెల క్రితం వరకూ రూ.350గా ఉన్న చికెన్ ధర ఇప్పుడు రూ.650కి చేరింది. దీంతో చికెన్ అంటేనే అక్కడి జనం భయపడిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో రూ.800 దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు అక్కడి వ్యాపారులు.
ద్రవ్యోల్భణం భారీగా పెరగడంతో పాక్ ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి. కరాచీ, పెషావర్, లాహోర్ వంటి పట్టణాల్లో ప్రజలు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అక్కడ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.10వేలు(పాకిస్థాన్ కరెన్సీలో) చేరుకున్న సంగతి తెలిసిందే.
కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందం రోజుల వ్యవధిలో పాక్ ప్రజల్లో ఆవిరవుతోంది. ద్రవ్యోల్భణం రేటు ఆకాశానికి అంటుతున్న తరుణంలో నిత్యావసర సరకులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.